టాటా కన్నకల --"నానో" -nano super car for 2000$ only
Posted On Tuesday, March 24, 2009 at at 12:56 AM by MOVIE
ప్రపంచంలోనే అతితక్కువ ధరకు కారును తయారు చేయాలని ఆరేళ్ల క్రితం టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా కన్నకల సాకారమైంది. టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిన్నకార్ల ప్రాజెక్టులో ఎన్నో అడ్డంకులకు ఎదురునిలిచిన "నానో"ను రతన్ టాటా సోమవారం ముంబయిలోని పార్సి జింఖానాలో ఆవిష్కరించారు.
ఈ కారు రూ.1.2 నుంచి 1.3 లక్షల ధరతో రోడ్డుపైకి వస్తుంది. నానో బుకింగ్ సౌకర్యం ఏప్రిల్ 9న ప్రారంభమై ఏప్రిల్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.2999 ప్రాథమిక చెల్లింపు ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు. మొదటి దఫాలో కేటాయించే లక్ష నానో కార్లకు లాటరీ ద్వారా వినియోగదార్లను ఎంపిక చేస్తారు. వాటి డెలివరీ జులై నుంచి ప్రారంభించనున్నారు.
గుజరాత్‌లోని సనంద్ ప్యాక్టరీ ఈ ఏడాది ఆఖరుకు లేదా 2010 ప్రారంభంలో ఉత్పత్తికి సిద్ధమవుతుందని టాటా మోటార్స్ పేర్కొంది. దేశవ్యాప్తంగా టాటా వాహన డీలర్లు, ఇతర కంపెనీ అవుట్‌లెట్లు, 850 నగరాల్లోని వెయ్యికిపైగా ఎస్‌బీఐ శాఖలు, ఇతర ఎంపిక చేసిన రుణదాతలతో కలిపి మొత్తం 30 వేల కేంద్రాల్లో కారు దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో దరఖాస్తు వెల రూ.300.
ప్రారంభ (బేస్), డీలక్స్ (సీఎక్స్), లగ్జరీ (ఎల్ఎక్స్) అనే మూడు మోడళ్లలో నానో లక్ష్యం అవుతుంది. బేస్ వెర్షన్ ఖరీదు రూ.లక్షకాగా, డీలక్స్ వెర్షన్ రూ.1.39-1.42 లక్షలు, లగ్జరీ వెర్షన్ ధర రూ.1.70 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇవన్ని ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు. 18 నెలలపాటు లేదా 24 వేల కిలోమీటర్ల వరకు నానోపై టాటా మోటార్స్ వారంటీ ఇస్తుంది.