హైదరాబాద్ బుక్ ట్రస్ట్ Hyderabad Book Trust
Posted On Saturday, July 4, 2009 at at 9:54 AM by MOVIEప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు - డి. ఎన్ ఝా ...పారడాక్స్ అఫ్ ది కౌ ....
ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు
- డి. ఎన్ ఝా ...
మన దేశంలో ఆహారపు అ లవాట్లు ఎప్పుడూ ఒకేలా లేవు. కాలమాన పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి మారుతూ వచ్చాయి.
ఇప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒకో రకమైన ఆహారపు అ లవాట్లు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు ''జలపుష్పాలు''గా పరిగణిస్తారు. అంటే వాళ్ల దృష్టిలో చేపలంటే ఒకరకం సముద్రపు ఆకుకూర లాంటివన్నమాట. అయితే వాళ్లు కూడా ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్‌లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు. అదేవిధంగా మనదేశంలో చాలా చోట్ల శాఖాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.
ఈ నాడు ఆవు హిందువుల మత చిహ్నంగా మారిపోయింది. పరమ పవిత్రమైన జంతువుగా పూజలందుకుంటోంది. కానీ వేదకాలంలో, ఆతరువాత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాల్లో అంత పవిత్రమైనదిగా చూడబడలేదని, ఆకాలంలో ఇతర జంతువులలాగే ఆవులను యజ్ఞ యాగాల్లో బలియిచ్చేవారని, బ్రాహ్మణులు సైతం గోమాంసాన్ని ఆరగించేవారనీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా సోదాహరణంగా వివరిస్తారు ప్రొఫెసర్ డి.ఎన్.ఝా.
గోసంరక్షణ ఆహ్వానించదగ్గదే ఆయినా అది శాస్త్రీయ పద్ధతిలో, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరగాలి తప్ప పరమత ద్వేషంతోనో, మూఢనమ్మకాలతోనో కాదనీ, ఒక్క ఆవునే ఎందుకు మిగతా జంతువులను మాత్రం ఎందుకు రక్షించకూడదు అంటారాయన. ఆయన రాసిన Paradox of the Cow: Attitudes to Beef Eating in Early India పరిశోధనా గ్రంథం పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే చరిత్రను నిష్పాక్షికంగా పరిశోధించాలనే తప్ప ఇందులో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదంటారాయన.
స్వయంగా శాఖాహారి అయిన ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర బోధకులు. ఆయన సుదీర్ఘ పరిశోధనా పత్రంలోని కొంత భాగాన్ని ఈ చిరుపుస్తకంగా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందులోంచి కొన్ని వ్యాఖ్యలు:
...గోమాంసం తినే అ లవాటు భారతదేశానికి విదేశాల నుంచి వలస వచ్చినవాళ్ల ద్వారా ముఖ్యంగా ముస్లింల ద్వారా మన దేశానికి సంక్రమించిందనీ, గోమాంస భక్షణని వాళ్లే మనదేశంలో ప్రవేశపెట్టారనీ కొందరు నమ్ముతారు. కానీ యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది మన దేశంలో చాలా ప్రాచీన కాలంనుంచే వుంది.
...పాకిస్థాన్‌లోని షిన్ తెగకు చెందిన ముస్లింలు ఇతర ముస్లింల మాదిరిగా పంది పట్ల ఎంత ఏహ్య వైఖరి కనబరుస్తారో ఆవు పట్ల కూడా అంతే ఏహ్య వైఖరి కనబరుస్తారు. వాళ్లు ఆవు మాంసాన్ని కూడా పంది మాంసంలాగే ఏవగించుకుంటారు.
...ప్రాచీన కాలపు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమేథ లేదా అశ్వమేధ యాగాల్లో గోవును లేదా గుర్రాన్ని బలి ఇవ్వడం సర్వసాధారణమైన ఆచారంగా వుండేది.
...వేదాలలో మొత్తం 250 రకాల జంతువుల ప్రస్తావన వుంది. వాటిలో 50 రకాల జంతువులు పవిత్రమైన బలికి, మానవ వినియోగానికి అర్హమైనవిగా పేర్కొన్నారు. ''తైత్తరేయ బ్రాహ్మణం''లో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వాయ్ గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ''సుతపథ బ్రాహ్మణం''లో యజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసాన్ని కోరడం గురించిన ప్రస్తావన వుంది.
...ఋగ్వేద కాలంలో చనిపోయిన వ్యక్తి శవాన్ని కప్పేందుకు దళసరి ఆవు కొవ్వును ఉపయోగించేవారు. ఆ వ్యక్తి పరలోక యాత్రకు వాహనంగా ఉపయోగపడేందుకని శవంతో పాటు ఒక ఎద్దును కూడా దహనం చేసేవారు. ఉత్తర క్రియల్లో (దశదిన కర్మ) భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు యిచ్చేవారు. ఆరోజు సమర్పించే జంతువుల స్థాయిని బట్టి పితృదేవతల సంతృప్తి ఆదారపడి వుంటుందని నమ్మేవారు. (ఋగ్వేదం X.14-18), అధర్వణ వేదం X 11.2, 48)
...మహా భారతంలోని అత్యధిక పాత్రలు మాంసాహారం తినేవే. రంతిదేవుని కథ ఇందుకు పరాకాష్ట. ప్రతిరోజూ ఆయన వంటగదిలో అనేక ఆవులను వధించి బ్రాహ్మణులకు ధాన్యంతో పాటు మాంసం పంచేవారు. రామాయణంలో ఆవుతో సహా వివిధ జంతువులను బలియివ్వడం, తిండి కోసం వధించడం గురించి వాల్మీకి అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.
... యమునా నదిని దాటేటప్పుడు సీత ''రాముడు తన ప్రతిజ్ఞా పాలన పూర్తిచేసిన తరువాత 1000 ఆవులతో , 100 పీపాల మద్యంతో నిన్ను కొలుస్తాను తల్లీ'' అని మొక్కడం గమనించవచ్చు.
... సీతకు దుప్పి మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే రాముడు లేడి రూపంలో వున్న మారీచుణ్ని వెంటాడి వేటాడి చంపుతాడు. అట్లాగే భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని ఆహ్వానించిన వైనం కూడా రామాయణంలో కనిపిస్తుంది.
... గౌతమ బుద్ధుడు, మహావీరుడు అహింసా సిదాంతాన్ని ప్రచారం చేశారు. వైదిక కాలపు జంతుబలిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే బుద్ధుడు మాంసాహారాన్ని తినకూడదని చెప్పలేదు. బౌద్ధ మతస్థులకు మాంసాహారం ఆమోదయోగ్యమనేందుకు గ్రంథస్త ఆధారాలు అనేకం వున్నాయి.
... మధ్యయుగపు తొలి రోజుల నుంచే గోవధ, గోమాంస భక్షణ పాపకార్యంగా చూడబడుతోంది.
...హిందూ గో సంరక్షణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పటి నుంచీ రాజకీయ జన సమీకరణకు ఆవు ఒక సాధనంగా మారింది. 1882లో మొట్టమొదటి గోరక్షిణి సభ ను స్థాపించి స్వామీ దయానంద సరస్వతి అశేష జన బాహుళ్యాన్ని సంఘటిత పరిచేందుకు ఆవును మరింత బలమైన ప్రతీకగా తీర్చిదిద్దాడు. 1880లలో, 1890లలో ముస్లింల గోవధను ఎదిరించడం, తత్ఫలితంగా మతకలహాలు చెలరేగడం అనేక సార్లు జరిగింది. 1966లో జాతీయ స్థాయిలో గోవధను నిషేధించాలన్న డిమాండుతో అన్ని మతతత్వ పార్టీలు పార్లమెంటు ముందు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. 1979లో ఆచార్య వినోభా భావే దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అస్పష్ట హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించుకున్నారు.