విజేత

ఇంటి పెద్ద కొడుకు కుటుంబం కోసం త్యాగాలు చేయడం ఇతివృత్తంగా బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటికి భిన్నంగా, అన్నలు వదిలేసిన బాధ్యతని తన భుజాలపై వేసుకుని కుటుంబం కోసం తనకి యెంతో ఇష్టమైన కెరీర్ ని వదులుకున్న ఓ తమ్ముడి కథతో వచ్చిన సినిమా ‘విజేత.’ అప్పటికే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి తో త్యాగపూరితమైన పాత్రని చేయించడం సాహసమే. నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 1985 లో ఈ సాహసం చేశారు.

బెంగాలి రచయిత రంజన్ రాయ్ రాసిన కథని ఆధారంగా చేసుకుని అప్పటికే బెంగాలి లోనూ, హిందీ లోనూ తీసిన రెండు సినిమాలూ విజయం సాధించడం తో, అదే కథతో తెలుగులో సినిమా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు అరవింద్. ‘ఖైదీ’ తో చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఏ. కోదండ రామి రెడ్డి దర్శకుడు. రంజన్ రాయ్ కథకి జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.

రిటైరైన ఉద్యోగి నరసింహం (జే.వి. సోమయాజులు) నాలుగో కొడుకు మధుసూదన రావు (చిరంజీవి). ‘చినబాబు’ అని పిలుస్తారితన్ని ఇంట్లో అందరూ. అన్నలు ముగ్గురూ (రంగనాథ్, గిరిబాబు, నూతన్ ప్రసాద్) ఉద్యోగాలలో స్థిరపడగా, చినబాబు మాత్రం చదువు మీద కన్నా ఫుట్ బాల్ ఆట మీద మక్కువ చూపుతూ పరీక్షలు తప్పుతూ ఉంటాడు. ఇంటి పెద్దకోడలు సరస్వతి (శారద) కి చినబాబన్నా, ఇంటి ఆఖరి ఆడపిల్ల లక్ష్మి (సంయుక్త) అన్నా అభిమానం. పిల్లలు లేని ఆమె వాళ్ళిద్దరినీ తన పిల్లలుగా చూసుకుంటూ ఉంటుంది.

ఉమ్మడి కుటుంబలో చిన్నా పెద్దా ఏ అవసరం వచ్చినా చినబాబుకే పురమాయిస్తారు. ఉద్యోగం చేసే చిన్న వదిన (శ్రీలక్ష్మి) చెప్పు తెగిపోతే కుట్టించుకు వచ్చే బాధ్యత కూడా చినబాబుదే. (అప్పటికింకా చిరంజీవి కి మెగాస్టార్ హోదా రాకపోవడంతో, ఈ తరహా సన్నివేశాలలో నటించే అవకాశం దొరికింది) అతనికి చదువు, ఉద్యోగం లేవని వాళ్ళు అతన్ని హేళన చేస్తూ ఉంటారు. చినబాబుని ఉద్యోగస్తుడిగా చూడడం, లక్ష్మికి పెళ్లి చేయడం నరసింహానికి మిగిలిన బాధ్యతలు. ఈ ప్రయత్నాలలో ఉంటాడాయన. చినబాబు స్నేహితురాలు ప్రియదర్శిని (భానుప్రియ) అప్పుడప్పుడూ అతనితో కలల్లో డ్యూయెట్లు పాడుకుంటూ ఉంటుంది.

లక్ష్మి కి ఓ మంచి సంబంధం రావడం తో కథ మలుపు తిరుగుతుంది. కొడుకులు నలుగురినీ కూర్చోబెట్టి డబ్బు సర్దుబాటు చేయాలంటాడు నరసింహం. పైవాళ్ళు ముగ్గురూ తమవల్ల కాదంటారు. అంతగా ఐతే ఇల్లు అమ్మేయమని సలహా ఇస్తారు. ఇల్లు అమ్మడం ఇష్టం ఉండదు నరసింహానికి. సరస్వతి మాత్రం తన నగలతో లక్ష్మిని అలంకరించి అత్తవారింటికి పంపుతానంటుంది. డబ్బు సమకూర్చడం ఎలా అన్న సమస్య వేధిస్తుంది నరసింహాన్ని. అంతకు మించి కొడుకుల నిజ రూపం భయపెడుతుంది ఆయన్ని.

సరిగ్గా అప్పుడే చినబాబుకి ఫుట్ బాల్ టోర్నమెంట్లో ఆడే అవకాశం వస్తుంది. అదే సమయంలో తండ్రి డబ్బుకోసం కిడ్నీ అమ్మడానికి సిద్ధపడ్డాడని తెలిసి కలవరపడతాడు. కిడ్నీ కోసం ప్రకటన ఇచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ (సత్యనారాయణ) ని కలిసి తన కిడ్నీ తీసుకోవాల్సిందిగా కోరతాడు. ఇక జీవితంలో ఫుట్ బాల్ ఆడే అవకాశం ఉండదని తెలిసినా తన నిర్ణయాన్ని మార్చుకోడు. అటు పెళ్లి ఇటు ఆపరేషన్ ఒకే సారి కావడం తో ముందుగానే డబ్బు తీసుకుని పెద్దక్క శాంత (శుభ) ఇచ్చిందని చెప్పి వదినకి ఇచ్చి హాస్పిటల్లో చేరతాడు.

ఆపరేషన్ జరిగాకే ఇంట్లో వాళ్లకి జరిగిందేమిటో తెలుస్తుంది. ఎందుకూ కొరగాడనుకున్న చిన్న కొడుకు చేసిన త్యాగం తండ్రిని కదిలిస్తుంది. ‘చినబాబు మాత్రమే నా కొడుకు.. అతనికి ఇష్టమైతే మీరు ఈ ఇంట్లో ఉండొచ్చు..’ అని ముగ్గురు కొడుకులకీ చెబుతాడు నరసింహం. చిరంజీవికి ఉన్న ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని ఈ కుటుంబ కథకి ఫైట్లు మాత్రం జత చేశారు..అవి కూడా ప్రధాన కథతో అంతగా సంబంధం లేనివే. ఈ సినిమాలో బాగా నిరాశ పరచేవి పాటలు. నేపధ్యంలో వచ్చే ‘యెంత ఎదిగి పోయావయ్యా..’ పాత మినహా మరే పాటా గుర్తుండదు, మరోసారి చూడాలనిపించదు. సంగీతం సమకూర్చింది చక్రవర్తేనా అన్న సందేహం కలుగుతుంది. (నేనైతే పాటల్ని ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేస్తా, ప్రతిసారీ).

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాత్ర శారదది. మరిది మీద ప్రేమ కురిపిస్తూనే అతన్ని బాధ్యతగా మందలించే చనువున్న వదిన సరస్వతి. ఈ పాత్రలో చాలా చక్కగా ఇమిడిపోయింది శారద. అలాగే చిరంజీవి-జే.వి. సోమయాజులు కాంబినేషన్ సన్నివేశాలు కూడా. ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఇవ్వడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ఇప్పుడొచ్చే చాలా కుటుంబ కథల్లో తెర నిండా మనుషులు ఉంటారు కాని, అందరూ ఒకేలా ప్రవర్తిస్తూ ఉంటారు, దాదాపుగా.. ప్రధాన పాత్రలతోనే హాస్యం సృష్టించినప్పటికీ, అల్లు రామలింగయ్య మీద ఓ ట్రాక్ పెట్టారు ప్రత్యేకంగా. ఇప్పటి యువ కథానాయకుడు అల్లు అర్జున్ ని బాల నటుడిగా చూడొచ్చు ఈ సినిమాలో. కుటుంబ కథల్ని ఇష్టపడేవాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.


Posted in |

0 comments: