శంభుని శిరము నుండి సీసాలోకి
Posted On Saturday, July 4, 2009 at at 6:20 AM by MOVIEప్రజలందరికీ మినరల్ వాటర్ సరఫరా చేస్తామని మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆర్ధిక మాంద్యం కారణంగా భూమిని అమ్ముకోవడం గిట్టుబాటు కావట్లేదేమో నీటిని అమ్ముకునే ఉపాయం కనిపెట్టారు మన పాలకులు. నీటి వ్యాపారమైతే ఏ మాంద్యమూ దెబ్బతీయదని వారి నమ్మకం. ఈ నిర్ణయంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మొన్న ఒక మంచి సంపాదకీయం రాశాడు. మన ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తమ బాధ్యతలను ప్రైవేటుకు ఎలా అప్పజెప్తున్నాయో, మధ్య తరగతి ప్రజలు ఎలా ఈ మార్పులను పట్టించుకోవడం మానేశారో చక్కగా వివరించాడు. కింద ఆ సంపాదకీయం చదవండి. శంభుని శిరము నుండి సీసాలోకి… ఇరవయ్యో శతాబ్ది రెండో దశకంలో జంట జలాశయాల నిర్మాణం పూర్తి అయ్యాక, హైదరాబాద్ నగరంలో పంపుల ద్వారా ఇళ్లకు మంచినీరు ఇచ్చే పథకం రెడీ అయింది. దానికి సంబంధించిన అంచనాలను, ఖర్చు ను భరించడానికి విధించవలసిన చార్జీలను అధికారులు ఏడో నిజాం ముందు సమర్పించారు. ఆ లెక్కలన్నీ చూసిన ఉస్మాన్ అలీఖాన్ ఒకే ఒక ప్రశ్న వేశారు. “ఏమిటి, మనం మంచినీళ్ల కోసం జనం నుంచి డబ్బులు వసూలు చేయాలా? ఇంత పెద్ద రాజ్యానికి పాలకుడనై ఉండి నేను నీళ్లను అమ్ముకోవాలా?” చరిత్రలో అపఖ్యాతి పాలైన ఒక రాచరిక నియంత అతను. అయినప్పటికీ, పాలితులతో ఉండవలసిన సంబంధం గురించి అతనికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఎన్ని రకాల పన్నులు వేసి జనాన్ని వేధించినప్పటికీ, మంచినీటికోసం రుసుము వసూలు చేయడానికి అతని పాలక హృదయం సమ్మతించలేదు. *** ఒకప్పుడు పల్లెటూరు తన కాళ్ల మీద తాను నిలబడేది. తన వేళ్ల మీద తను బతికేది. జాతరలకో అంగళ్లకో తప్ప కాలు బయటకు పెట్టే అవసరమే ఉండేది కాదు. పంట విత్తనాలను రైతే పదిల పరుచుకునేవాడు. చెరువు నీరిచ్చేది, పశువులు శక్తినిచ్చేవి. చెరువులోని పూడికమట్టీ, పశువులిచ్చే పేడా ఎరువులనిచ్చేవి. అప్పుడు ఊరి కి కావలసిన నీరు భూతల్లే ఇచ్చేది, కావలసిన గాలి వాయుదేవుడే ఇచ్చేవాడు. ఇప్పుడు ఊరు మారిపోయింది, పరాధీనమైపోయింది. విత్తనాలు కొనుక్కోవా లి, ఎరువులు కొనుక్కోవాలి, చెరువులు లేవు కదా నీటికోసం బోర్లో కాలువలో కావాలి, నీరు పారడానికి కరెంటు కావాలి, ఇవన్నీ బయటనుంచే రావాలి, సేద్యం ఇట్లా పరా«ధీనం కావడాన్నే, ఊరు వేళ్లు తెగిపోవడాన్నే అభివృద్ధి అంటున్నాము. ఆ అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ఊరూరుకూ ట్రాక్టర్లలో మంచినీళ్లు వస్తున్నాయి. పల్లానికి ప్రవహించవలసిన నీరు పెట్రోలు వాహనంపై తరలివస్తున్నది. ఇది చాలదన్నట్టు, మన గ్రామాన్ని మరింత మరింత అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఏలినవారు- ఊరూరికీ మినరల్ వాటర్‌ను ఇవ్వబోతున్నారు, రెండు రూపాయలకే ఇరవై లీటర్ల తాగునీళ్లు అందబోతున్నాయి. పదిపదిహేనేళ్ల కిందటిదాకా సీసాల్లో నీళ్లు, సాచెట్స్‌లో నీళ్లు మార్కెట్లో ఉండేవి కావు. ఇప్పుడు ఇల్లు దాటి బయటకు వచ్చిన వాళ్లకు, ప్రయాణాలు చేసేవాళ్లు, పరాయి వూళ్లలో బస చేసేవాళ్లు- పేదలూ మధ్యతరగతీ ధనికులూ అన్న భేదం లేకుండా- సీసాల నీళ్లు తాగుతున్నారు. మంచినీళ్లు సహజంగా, ఉచితంగా దొరికే ప్రకృతి వనరు అన్న స్ప ృహ సమాజం నుంచి మాయమైపోయింది. రోజువారీ తాగునీటి అవసరాలకు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రభుత్వ వ్యవస్థల సరఫరా ఇంకా కొనసాగుతోంది. పబ్లిక్ నల్లాలు, ఉచితంగా మంచినీరు ఇంకా ఉనికిలోనే ఉన్నాయి. ఇప్పుడు దానికి కూడా ఎసరు వచ్చింది. నీళ్లు కొనుక్కోవాల్సిందే. నీటిని శుద్ధిచేసే ఖర్చును మనమే భరించవలసిందే. భరించగలిగితేనే భోలక్‌పూర్‌లు జరగకుండా జనం భద్రంగా ఉండగలుగుతారు. ఆరోగ్యశ్రీ కూడా రక్షించలేని మహమ్మారి అతిసార రాకుం డా చూసుకోవలసిన బాధ్యత ఇక ప్రజలదే. ప్రకృతి వనరులతో సహా సర్వాన్ని మార్కెట్‌మయం చేసే మాయ, ప్రభుత్వం అందించే ప్రతిసేవకూ ఖరీదు కట్టే మాయ- ఈ మాయ మనకు అలవాటైపోయింది. జేబులో డబ్బు వదలడం ఒక్కటే కాదు ఇందులోని ప్రమాదం. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వా లు చేస్తున్న దుర్మార్గమైన ప్రయత్నం ఇందులోని అసలు ప్రమాదం. నీళ్ల సీసాలు కొనుక్కోవడం అలవాటైపోయాక రైల్వే స్టేషన్లలో బస్టాండుల్లో పంపుల్లో నీళ్లు ఎట్లా ఉంటున్నాయో మనం అడగడం మానేశాం. మన పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివించడం మొదలుపెట్టాక, ప్రభుత్వ పాఠశాల ల్లో పంతుళ్లున్నారో లేరో బల్లలున్నాయో లేవో అడగడం మానేశాం. అప్పోసప్పో చేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే వైద్యానికి మనం తెగబడినప్పుడు- తెలియకుండానే ఒక ప్రభుత్వాస్పత్రిని మనం చావుదెబ్బ తీస్తున్నాం. మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూడడం మొదలుపెట్టాక, సాదాసీదా సినిమా హాళ్లలో దోమలున్నాయో నల్లులున్నాయో పట్టించుకోవడమే మానేశాం. మహానగరాల్లోనే మన మకాం స్థిరపడ్డాక, మన ఇళ్లకు జనరేటర్లను, ఇన్‌వర్టర్లను బిగించుకున్నాక, కరెంటు కోత ఎట్లా ఉంటుందో తెలుసుకోవడం కూడా మానేశాం. మనం పబ్లిక్ వ్యవస్థలనుంచి వేరుపడి, సొంత ఏర్పాటు చేసుకున్నప్పుడల్లా- అధిక సంఖ్యాకులు ఉపయోగించే ప్రభుత్వ సదుపాయాల నాణ్యత పడిపోతూ వస్తోంది, నిలదీసి అడగలేని నిరుపేదలు మాత్రమే లబ్ధిదారులుగా ఉండే సంక్షేమ వ్యవస్థలు, పౌరవ్యవస్థలు మరింత దిగజారిపోతున్నాయి. చదువూ చెప్పక, ఉపాధీ ఇవ్వక, ఆరోగ్యమూ చూపక, చివరకు మంచినీళ్లూ డ్రైనేజీ కూడా అందించక- ఇక ప్రభుత్వాలు ఏమి చేస్తాయో? సమీక్షా సమావేశాల సమయం కూడా ఆదాచేసి, ఏ ప్రభువులకు చాకిరీ చేయాలో? అమ్మకమూ కొనుగోలూ తప్ప మరేమీ తెలియ ని సరుకుల ప్రపంచంలో- సమష్టి జీవనమూ ఉమ్మడి వనరులూ సాముదాయిక సదుపాయా లూ నిరర్ధకంగా కనిపిస్తాయి. భారతదేశంలో నీటి కోసం జనం చెల్లించే చార్జీలు బాగా తక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆర్థిక సంస్థలు గుండెలు బాదుకుంటున్నాయి. వాళ్లకు మన జీవనదులు, భూగర్భజలాలు, చెరువులూ సరస్సులూ ధనాశయాల వలె కనిపిస్తున్నాయి. వీటిని పదిమంది కలసి పొదుపుగానో సర్దుబాటుతోనో వాడుకోవ డం వారికి నచ్చడం లేదు. అందుకోసమని, ముందు వ్యవస్థలను విఫలం చేసి, వాటిమీద విశ్వాసం భగ్నం చేసి- ఆపైన ఖరీదుచేసే సేవలను ఆశ్రయించేట్టు చేయడం ప్రపంచ బేహారుల వ్యూహం. ఆ వ్యూహం విజయవంతం కావడానికి దళారీతనం చేసిపెట్టే నాయకులది క్షమార్హం కాని ద్రోహం. ప్రజలు నిలుచున్న నేలను దోచుకున్న తరువాత, ఇక మిగిలింది- నేలను నోటినీ తడిచేసే నీరే. ఉన్నవారూ లేనివారూ పెద్దా చిన్నా కులాల వారూ పదిమంది కలసి పంచుకునే స్థలాలన్నీ మాయమవుతున్నాయి చూడండి, పబ్లిక్ పార్కులన్నిటికీ ప్రవేశ రుసుములున్నాయి గమనించండి, ఒక్క పాఠశాలకూ ప్లేగ్రౌండ్ లేదు తెలుసుకోండి. ఆఖరుకు రోడ్ల మీద చిన్నవాహనానికి అంగుళం జాగాలేదు. పాదచారికైతే ఫుట్‌పాత్‌లు కూడా మిగలలేదు. ఏ ఒక్క స్థలమూ రహదారి కాదు. శ్మశానం కూడా ఆక్రమణలకు అతీతం కాదు. ఎవడి స్థలం వాడిదే. ఈ శరీరాన్ని క్షణం పార్క్ చేయాలన్నా ఎక్కడో టికెట్ కొనాల్సిందే. హలాల్ చేసే గొంతును తడపాలన్నా నీళ్లు కొనాల్సిందే. ఇరవైలీటర్ల నీరు రెండురూపాయలు. లీటర్ సీసా పదిహేను రూపాయలకు కొనేవారికి ఇది చవకగానే కనిపించవచ్చు. డ్వాక్రా మహిళలో, పొదుపు గ్రూపులో నెట్‌వర్క్ తయారుచేసిపెడితే, రేపది వందల వేల కోట్ల వ్యాపారం. ఆ జలయజ్ఞం లో అవినీతి ఉన్నదని ధనయజ్ఞం అన్నారేమో విమర్శకులు కానీ, ఈ సుజలయజ్ఞం మాత్రం స్వచ్ఛమైన ధనయజ్ఞం.